Tirumala: పార్వేట ఉత్సవం నేపథ్యంలో పలు సేవలను రద్దు చేసిన టీటీడీ

TTD Cancel some sevas on 16th januaray in Tirumala

  • సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు సేవలను రద్దు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
  • 14న భోగితేరు, 15న సంక్రాంతి వేడుక నిర్వహణ
  • 16న పార్వేట ఉత్సవం
  • అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం సహా పలు సేవల రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవాల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం పలు సేవలను రద్దు చేసింది. సంక్రాంతి సందర్భంగా 14న శ్రీ గోవిందరాజులస్వామివారి ఆలయంలో భోగితేరు, 15న మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. 14న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగిస్తారు.

16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. అదే రోజు గోదా పరిణయోత్సవం కూడా ఉంటుంది. ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెదజీయర్ మఠం నుంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామి వారికి సమర్పిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేస్తారు.  ఆస్థానం, పార్వేట కార్యక్రమాల అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. 

ఈ నేపథ్యంలో 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీడీడీ రద్దు చేసింది. కాగా, నిన్న ప్రారంభమైన శ్రీ ఆండాళ్ నీరాటోత్సవాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి.

  • Loading...

More Telugu News