iPhone: ఐఫోనా మజాకా... 16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడినా ఏమీ కాలేదు!
- విమానం గాల్లో ఉండగా డోరు ప్లగ్ ఊడిపోయి కిందపడిన ఘటన
- విమానం నుంచి ఐఫోన్ కూడా కిందపడిపోయిన వైనం
- రోడ్డు పక్కన ఓ వ్యక్తి కంటపడిన ఐఫోన్
ఇటీవల అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్ లైన్స్ విమానం గాల్లో ఉండగానే డోరు ఊడిపోవడం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఒక ఆసక్తికర ఉదంతం వెల్లడైంది. జనవరి 6న అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం 177 మంది ప్రయాణికులతో పోర్ట్ లాండ్ ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది. అయితే, మార్గమధ్యంలో విమానం డోరు ఊడిపోయింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా ఓరెగాన్ లో ల్యాండింగ్ చేశారు.
కాగా, విమానం డోర్ తో పాటు డోర్ ప్లగ్ కూడా పడిపోయింది. వాటితోపాటే ఇంకో వస్తువు కూడా విమానం నుంచి కిందపడిపోయింది. అది ఓ ఐఫోన్. ఓ వ్యక్తి ఐఫోన్ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని గుర్తించాడు.
ఆసక్తికర విషయం ఏమిటంటే... విమానం ఆకాశంలో 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఆ డోర్ ప్లగ్, ఐఫోన్ కిందడిపోయాయి. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఐఫోన్ కు ఏమీ కాలేదు. అది ఇంకా పనిచేస్తూనే ఉంది. అది ఇంకా ఏరోప్లేన్ మోడ్ లో ఉన్న విషయం ఆ ఐఫోన్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. అతడు ఆ ఫోన్ ను అధికారులకు అప్పగించాడు.
అయితే అది ఏ మోడల్ ఐఫోన్ అన్నది స్పష్టంగా తెలియలేదు కానీ, బహుశా అది ఐఫోన్ 14 ప్రో కానీ, ఐఫోన్ 15 ప్రో కానీ అయ్యుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడినప్పటికీ ఆపిల్ తయారీ ఐఫోన్ కు ఏమీ కాకపోవడం ఒక అద్భుతం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.