Mohammed Shami: రాష్ట్రపతి నుంచి అర్జున అవార్డు స్వీకరించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ
- షమీ ప్రతిభకు గుర్తింపుగా అర్జున అవార్డు ప్రకటించిన కేంద్రం
- నేడు ఢిల్లీలో క్రీడా అవార్డుల ప్రదానోత్సవం
- హాజరైన షమీ, ఇతర క్రీడాకారులు
భారత్ తరఫున అంతర్జాతీయంగా సత్తా చాటిన అత్యంత ప్రతిభావంతులైన పేసర్లలో మహ్మద్ షమీ ఒకడు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో షమీ బౌలింగ్ ప్రదర్శన అతడి పేస్, స్వింగ్ నైపుణ్యాలకు అద్దం పడుతుంది. ఎప్పటినుంచో టీమిండియాకు షమీ ప్రధాన బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. కేంద్రం షమీకి అర్జున అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, ఇవాళ దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమీ అర్జున అవార్డు స్వీకరించాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నేడు క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి షమీ, ఇతర క్రీడాకారులు హాజరయ్యారు. షమీకి అర్జునుడి ప్రతిమ, ప్రశంసాపత్రం అందజేశారు.
మహ్మద్ షమీ ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. అయితే, అక్కడి క్రికెట్ సంఘం రాజకీయాలతో విసిగిపోయి పశ్చిమ బెంగాల్ కు తరలివెళ్లాడు. బెంగాల్ తరఫున రంజీల్లో సత్తా చాటి టీమిండియా తలుపుతట్టాడు.
33 ఏళ్ల షమీ ఇప్పటివరకు 64 టెస్టుల్లో 229 వికెట్లు... 101 వన్డేల్లో 195 వికెట్లు... 23 అంతర్జాతీయ టీ20ల్లో 24 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో 88 మ్యాచ్ ల్లోనే 332 వికెట్లు సొంతం చేసుకున్నాడు.