Annapoorani: అనుకున్నదొకటి .. అయినదొకటి .. నయనతారను చిక్కుల్లో పడేసిన 'అన్నపూరణి'
- నయనతార నుంచి వచ్చిన 'అన్నపూరణి'
- దర్శకత్వం వహించిన నీలేశ్ కృష్ణ
- అతని ఆలోచనా విధానం పట్ల ఒక వర్గం అసహనం
- చాలా చోట్ల కేసులు నమోదవుతున్న పరిస్థితి
తమిళనాట లేడీ ఓరియెంటెడ్ కథలను రెడీ చేసుకున్నవారు ముందుగా నయనతారనే సంప్రదిస్తూ ఉంటారు. అందుకు కారణం అక్కడ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా నాయిక ప్రధానంగా నయనతార చేసిన సినిమాలు ఆడుతూ ఉంటాయి. అదే స్థాయిలో భారీ వసూళ్లను నమోదు చేస్తూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో నయనతార చేసిన సినిమాగా 'అన్నపూరణి' కనిపిస్తుంది.
నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో నయనతార చేసిన 'అన్నపూరణి' డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవితంలో ఒక లక్ష్యం .. పట్టుదల ఉంటే ఎలాంటి అవాంతరాలనైనా దాటుకుని అనుకున్నది సాధించవచ్చనే ఉద్దేశాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. అందుకు దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. ఈ సినిమా విడుదల సమయంలో చెన్నైలో వరదలు రావడం వలన జనాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రావడంతో అన్ని ప్రాంతాలలో అగ్గి రాజేసినట్టుగా అయింది. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల అన్ని ప్రాంతాలలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో నయనతార సహా ఈ సినిమా టీమ్ పై కేసులు నమోదవుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా విషయంలో దర్శకుడు అనుకున్నది ఒకటి .. అయినదొకటి అన్నట్టుగా ఉంది పరిస్థితి.