Gunturu Karam: మహేశ్ గురించి ఈ మాట చెప్పడానికి ఇండస్ట్రీలో ఎవరూ వెనకాడరు:'గుంటూరు కారం' ఈవెంటులో త్రివిక్రమ్
- ఘనంగా జరిగిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఇంత కష్టపడే హీరోను చూడలేదన్న త్రివిక్రమ్
- మనసులోను .. వయసులోను ఆయన యంగ్ అంటూ కితాబు
- కృష్ణగారి తరఫున ఆయనను ఆశీర్వదించాలని వ్యాఖ్య
మహేశ్ బాబు .. త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'గుంటూరు కారం' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును 'గుంటూరు'లో .. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో నిర్వహించారు.
ఈ స్టేజ్ పై త్రివిక్రమ్ మాట్లాడుతూ .. " ఈ రోజున నేను గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పేరు 'గుంటూరు కారం' కావడం, ఈ సినిమాలోని కథానాయకుడు 'రమణ' మీ అందరిలో నుంచి వచ్చినవాడు. అందువలన మీ అందరి మధ్యలోనే ఈ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాము" అని అన్నారు.
" ఇక రెండో కారణం .. తెలుగు సినిమా నుంచి విడదీయలేని ఒక అంతర్భాగం కృష్ణగారు. 'అతడు' .. 'ఖలేజా' సినిమాల సమయంలో ఆయనతో గడిపిన ప్రతిక్షణం నాకు చాలా అమూల్యమైనది .. అపూర్వమైనది. కృష్ణగారి కొడుకుగా పుట్టడం మహేశ్ చేసుకున్న అదృష్టం. ఒక సినిమాకి 100 శాతం పనిచేయాలంటే 200 శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేశ్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ వెనకాడరు" అని చెప్పారు.
" మహేశ్ బాబు 'అతడు' సినిమా సమయంలో ఎలా ఉన్నారో .. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. చూడటానికి ఎంత యంగ్ గా ఉన్నారో .. పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అంతే యవ్వనంగా ఉన్నారు. కృష్ణగారి తరఫున మీరంతా ఆయన వెనకుండాలి .. ఆశీర్వదించాలి" అని అన్నారు.