Dr Sanjeev Kumar: వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్
- వైసీపీలో మరో వికెట్ డౌన్
- పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ సంజీవ్ కుమార్
- ఇటీవల సంజీవ్ కుమార్ ను ఇన్చార్జి పదవి నుంచి తప్పించిన వైసీపీ
ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.
సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన సన్నిహిత వర్గాలతో చర్చించిన తర్వాత భవిష్యత్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. మరో 10, 20 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాలని కోరుకుంటున్నానని, తన ఆలోచనలను ప్రజల కోసం ఉపయోగించాలన్నదే తన కోరిక అని డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు.
ఇటీవల విజయసాయిరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే దొరకలేదన్నారు. విజయవాడ వచ్చి నాలుగు రోజులైందని, ఇక ఎక్కువ రోజులు వేచి చూడడం బాగుండదని భావించానని, మనసులో ఉన్నది చెప్పేయడం మంచిదని నిర్ణయించుకుని ఈ వివరాలు తెలుపుతున్నానని సంజీవ్ కుమార్ చెప్పారు.