Daggubati Venkateswarlu: మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
- వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందని ఇటీవల పేర్కొన్న దగ్గుబాటి
- ఈసారి ఎన్నికల్లో టికెట్ రానివాళ్లు అదృష్టవంతులని తాజాగా వెల్లడి
- ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని వ్యాఖ్యలు
- ఇప్పుడంతా పార్టీ అధినేతలే సంపాదించుకుంటున్నారని విమర్శలు
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందని ఇటీవల వ్యాఖ్యానించిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్రభూమి మహాప్రస్థానం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు రావో వాళ్లు అదృష్టవంతులు అని అన్నారు. ఎన్నికల్లో టికెట్ ఇస్తే రూ.40 కోట్లు, రూ.50 కోట్లు ఖర్చు తప్ప ఏమీ ఉండదని, అదే వాళ్లకు టికెట్ రాకపోతే ఆ రూ.40 కోట్లు, ఆ రూ.50 కోట్లు మిగిలినట్టే కదా అని పేర్కొన్నారు.
ఎన్నికలంతా డబ్బుమయం అయిపోయిందని, గతంలో ఎమ్మెల్యేలకు సంపాదించుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడా అవకాశం కూడా లేదని అన్నారు. ఇప్పుడంతా పార్టీ అధినేతలే సంపాదించుకుంటున్నారని అన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ ద్వారా ఎంత వస్తుందా అని చూసుకుంటున్నారని దగ్గుబాటి తెలిపారు. దేశంలోని ఏక వ్యక్తి పార్టీలన్నింట్లోనూ ఇదే తంతు నడుస్తోందని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని వివరించారు. అన్ని కోట్లు పెట్టి గెలిచినా ప్రజాసేవకు అవకాశం లేకుండా పోతోందని అభిప్రాయపడ్డారు.