Pongal: రేషన్‌తో పాటు రూ.1000 నగదును పంపిణీ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
- పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2 కోట్ల రేషన్‌దారులకు పొంగల్ కానుక
- ఆళ్వార్‌పేటలో లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి
- పొంగల్ కానుక నేపథ్యంలో రద్దీ నివారణకు టోకెన్లు జారీ చేసిన ప్రభుత్వం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్‌తో పాటు రూ.1000 నగదును అందిస్తున్నారు. రేషన్, నగదు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆళ్వార్‌పేటలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది రేషన్ కార్డు దారులు ఉన్నారు. వారందరికీ పొంగల్ సందర్భంగా బియ్యం, పంచదార, చెరుకు గడలతో పాటు వెయ్యి రూపాయల నగదును అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించినట్లు సీఎం స్టాలిన్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు.
సమానత్వం, సౌభ్రాతృత్వం అందరి హృదయాల్లో, ఇళ్లల్లో వర్ధిల్లాలని... ప్రతిచోట ఆనందం నిండాలని ఆకాంక్షించారు. లబ్ధిదారులకు ఉచిత ధోతీ, చీరల పంపిణీని కూడా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రేషన్ దుకాణాలలో వీటిని పంపిణీ చేస్తారు. పొంగల్ కానుక కోసం జనం రద్దీని నివారించేందుకు ఇప్పటికే టోకెన్లు జారీ చేశారు. ఎవరు ఏ రోజు... ఏ సమయంలో రేషన్ దుకాణాల వద్దకు వచ్చి కానుకలను తీసుకు వెళ్లాలనే వివరాలను ఆ టోకెన్లలో పేర్కొన్నారు.