Ambati Rayudu: వైసీపీలో ఉంటే నా కల నెరవేరదనిపించింది: అంబటి రాయుడు
- గత డిసెంబరులో వైసీపీలో చేరిన రాయుడు
- కొన్నిరోజుల కిందటే రాజీనామా
- ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ తో భేటీ
రాజకీయ అనుభవం బొత్తిగా లేని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. గత డిసెంబరులో వైసీపీలో చేరి, అంతలోనే ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయుడు... ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవడం ద్వారా మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఈ భేటీ అనంతరం రాయుడు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు.
"పరిశుద్ధ హృదయంతో, కల్మషం లేని ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చి నేను ఏం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేయవచ్చు అన్న ఉద్దేశంతో వైసీపీలో చేరాను.
వాస్తవిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు నేను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాను. ఎన్నో గ్రామాలు తిరిగి, ఎంతో మంది ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను. కొన్ని సమస్యలను వ్యక్తిగతంగా పరిష్కరించాను కూడా. ఎంతో సామాజిక సేవ చేశాను.
అయితే కొన్ని కారణాల వల్ల.... వైసీపీలో కొనసాగితే నా కలను నెరవేర్చుకోలేనని అనిపించింది. ఇందులో ఎవరినీ తప్పుబట్టడంలేదు. నా భావజాలానికి, వైసీపీ సిద్ధాంతాలకు ఏమాత్రం సారూప్యత లేదన్న విషయం అర్థమైంది. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నాను. ఫలానా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అంశం కారణంగానే నేను రాజీనామా చేశాననడం అర్థరహితం.
కానీ నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు "ఓసారి పవన్ అన్నను కలిసి చూడు... ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు... ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకో" అని చెప్పారు. ఈ క్రమంలోనే నేను పవన్ అన్నను కలిసి చాలా సమయం పాటు చర్చించాను.
జీవితం గురించి, రాజకీయాల గురించి మేం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సమావేశం నాకెంతో సంతోషం కలిగించింది... ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు, ఆలోచనలు.... నా భావజాలం, ఆలోచనలు ఒకేలా అనిపించాయి. ఆయనను కలవడం ఒక ఆనందకరమైన పరిణామం.
ప్రస్తుతం నేను క్రికెట్ ఒప్పందాల నేపథ్యంలో దుబాయ్ వెళుతున్నాను. ఏపీ ప్రజలకు సేవ చేసేందుకు నేను ఎల్లప్పుడూ ముందుంటాను, వారి కోసం చిత్తశుద్ధితో నిలబడతాను" అంటూ రాయుడు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
రాయుడికి వినాయక ప్రతిమను బహూకరించిన పవన్