KL Rahul: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌కు టీమిండియాలో కీలక మార్పులు?

A key change in Team India for the Test series against England saying reports
  • కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మారనున్నాడని చెబుతున్న రిపోర్టులు
  • ఇషాన్ కిషన్ కీపర్‌గా వ్యవహరించనున్నాడని పేర్కొన్న క్రిక్‌బజ్ రిపోర్ట్
  • స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌ను ఆడించనున్నట్టు విశ్లేషణ
ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు టీమిండియాలో మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే ఔననే అంటున్నాయి పలు రిపోర్టులు. దక్షిణాఫ్రికాతో ఇటీవలే జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రాణించిన కేఎల్ రాహుల్‌ స్థానంలో కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న ఇషాన్ కిషన్ స్వదేశంలో జరగనున్న ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడని క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు ఇషాన్ పేరు పరిశీలనలో ఉందని తెలిపింది. భారత్‌లో స్లో పిచ్‌లు, టర్న్‌ను పరిగణనలోకి తీసుకొని ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా కాకుండా కేవలం బ్యాట్స్‌మెన్‌గా పరిశీలించనున్నారని క్రిక్‌బజ్ రిపోర్ట్ పేర్కొంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడటానికి రాహుల్ సిద్ధంగా ఉన్నాడని విశ్లేషించింది. కాగా కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. సంక్లిష్టమైన పిచ్‌లపై ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు. వన్డే ప్రపంచ కప్ నుంచి కేఎల్ రాహుల్ కీపర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు దూరమైన ఇషాన్ కిషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న అతడు తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సి ఉంటుందని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇటీవలే వ్యాఖ్యానించాడు. ఇషాన్ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి సమస్యా లేదని, అయితే అందుబాటులో లేడని ద్రావిడ్ పేర్కొన్నాడు. మొహాలీలో ఆఫ్ఘనిస్థాన్‌ వర్సెస్ భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో కేఎస్ భరత్‌ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కేవలం బ్యాటర్‌గా ఎంపిక చేస్తే ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌తో పాటు అందుబాటులోకి వస్తే రిషబ్ పంత్ కీపర్ ఆప్షన్స్‌‌లో ఉంటారు. కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జనవరి 25న హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.
KL Rahul
Ishan Kishan
England vs India
Cricket
Team India
Rahul Dravid

More Telugu News