Infant Death: ఆడుకుంటూ నిమ్మకాయ నోట్లో పెట్టుకున్న చిన్నారి.. ఊపిరాడక మృతి!
- బయటకు తీసే ప్రయత్నంలో గొంతులోకి జారిన నిమ్మకాయ
- ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి
- లేకలేక పుట్టిన పాప మరణంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
- అనంతపురం జిల్లా మల్లేనిపల్లిలో విషాద ఘటన
పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు.. పిల్లల కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. ఏడేళ్లకు వాళ్ల పూజలు ఫలించి పండంటి ఆడపిల్ల పుట్టింది. లేకలేక పుట్టిన ఆడపిల్లను మహాలక్ష్మిలా అపురూపంగా చూసుకుంటున్నారు. అయితే, వారికి ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఏడేళ్ల ఎదురుచూపుల తర్వాత పుట్టిన పాప ఏడాది కూడా నిండకముందే కన్నుమూసింది.
వంటింట్లో ఆడుకుంటూ నిమ్మకాయ మింగడంతో అది గొంతులో చిక్కుకుని ఊపిరాడక చనిపోయింది. లేకలేక పుట్టిన బిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా మల్లేనిపల్లిలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లి గ్రామానికి చెందిన సకీదీప, గోవిందరాజులు దంపతులకు ఏడేళ్ల తర్వాత ఓ బిడ్డ పుట్టింది. సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఆ జంట.. లేకలేక పుట్టిన బిడ్డను అపురూపంగా పెంచుకుంటోంది. పాపకు జశ్విత అని పేరు పెట్టారు. ప్రస్తుతం జశ్విత వయసు తొమ్మిది నెలలు. ఈ క్రమంలో బుధవారం పాప ఆడుకుంటుండగా తల్లి సకీదీప వంటింట్లో పనిచేసుకుంటోంది. ఇంతలోనే చేతికందిన ఓ నిమ్మకాయను జశ్విత నోట్లో పెట్టుకుంది.
తల్లి గమనించి బయటికి తీసేందుకు ప్రయత్నించగా అది పాప గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారికి ఊపిరి అందలేదు. హుటాహుటిన పాపను పెద్దవడుగూరు ఆసుపత్రికి తరలించగా.. వైద్యుల సూచనతో అక్కడి నుంచి పామిడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరి ఆడకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే చిన్నారి జశ్విత కన్నుమూసింది. పామిడి ఆసుపత్రిలో జశ్వితను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే పాప చనిపోయిందని చెప్పడంతో తల్లిదండ్రులు సకీదీప, గోవిందరాజులు కన్నీరుమున్నీరయ్యారు. జశ్విత మృతితో మల్లేనిపల్లిలో విషాదం నెలకొంది.