Kesineni Chinni: చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించే స్థాయి నానికి లేదు: కేశినేని చిన్ని
- సొంత డబ్బా కొట్టుకోవద్దంటూ కేశినేని నానికి హితవు
- స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలేనని వెల్లడి
- కేశినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు సంబంధం లేదని వివరణ
- నాని ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును క్షమాపణ కోరిన కేశినేని చిన్ని
కేశినేని కుటుంబ గొడవలతో చంద్రబాబుకు గానీ, ఆయన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధంలేదని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. కుటుంబంలో గొడవలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని చెప్పారు. పార్టీ పెట్టక ముందు నుంచీ తమ కుటుంబంలో గొడవలు ఉన్నాయని వివరించారు. కేశినేని కుటుంబ సభ్యుడిగా ఎప్పటికప్పుడు తానే సర్దుకుంటూ వచ్చానని తెలిపారు. తమ కుటుంబానికి సంబంధించిన గొడవలను మీడియా ముందు వెల్లడిస్తూ కేశినేని నాని ఎన్నోమార్లు తనపై విమర్శలు చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ తాను ఏనాడూ మీడియా ముందుకు వచ్చి ఆయనపై విమర్శలు చేయలేదని తెలిపారు. కేశినేని నాని ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు కుటుంబానికి చిన్ని క్షమాపణలు చెప్పారు.
ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి..
కరోనా తర్వాత రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని కేశినేని చిన్ని చెప్పారు. తాను సంపాదించిన దాంట్లో ఎంతోకొంత వెచ్చించి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. అయితే, ఏనాడూ తాను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పలేదన్నారు. ఏనాడూ తన స్వార్థం కోసం చంద్రబాబును కలవలేదని స్పష్టం చేశారు. ఒకటి రెండుసార్లు ఆయనను కలిసినప్పుడు తను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించే మాట్లాడానని పేర్కొన్నారు.
స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలే..
కేశినేని నాని పదే పదే తన స్థాయి అదని, ఇదని చెప్పుకుంటాడని చిన్ని విమర్శించారు. తాను స్ట్రెయిట్ గా ఉంటానని, తన స్థాయి రతన్ టాటా, మోదీల స్థాయని కేశినేని నాని చెప్పుకుంటారని గుర్తుచేస్తూ.. స్థాయిని నిర్ణయించాల్సింది, నిర్ణయించేది ప్రజలేనని కేశినేని చిన్ని అన్నారు. అంతేకానీ సొంత డబ్బా కొట్టుకుంటే స్థాయి పెరగదని చెప్పారు. నారా లోకేశ్ అర్హత గురించి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఓ ముఖ్యమంత్రి తనయుడిగా, స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా వారి బాటలో నడుస్తూ లోకేశ్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. యువగళం పాదయాత్ర చేపడితే లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచారని గుర్తుచేశారు.
చంద్రబాబు రాక కోసం జనం ఎదురుచూస్తున్నారు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు అధికారంలోకి రావాలని, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని కేశినేని చిన్ని పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా చూసుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వాసులు అమరావతిని రాజధానిగా చూడాలని, చంద్రబాబు వస్తేనే అది సాధ్యమని భావిస్తున్నారని కేశినేని చిన్ని వివరించారు.