Rohit Sharma: రోహిత్ శర్మ నయా రికార్డు.. ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్‌లను అధిగమించిన హిట్‌మ్యాన్
- టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచిన రోహిత్
- ఆఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్‌లో 36 ఏళ్ల 256 రోజుల వయసులో నాయకత్వం
- శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీలను అధిగమించి రికార్డు నెలకొల్పిన హిట్‌మ్యాన్
ఆఫ్ఘనిస్థాన్‌పై తొలి టీ20 మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట నయా రికార్డు నమోదయింది. టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్లలో అతిపెద్ద వయస్కుడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో నాయకత్వం వహించి 36 ఏళ్ల 256 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించిన ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్‌లను రోహిత్ అధిగమించాడు.
2021లో 35 ఏళ్ల 236 రోజుల వయసులో టీ20 మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన శిఖర్ ధావన్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని 35 ఏళ్ల 52 రోజుల వయసులో కెప్టెన్‌గా వ్యవహరించి మూడవ స్థానంలో నిలిచాడు. 33 సంవత్సరాల 91 రోజుల వయసుతో నాలుగవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 33 ఏళ్ల 3 రోజుల వయసుతో 5వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. కాగా మొత్తం 13 మంది ఆటగాళ్లు ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకి నాయకత్వం వహించారు. 24 నుంచి 36 ఏళ్ల వయస్కులు కెప్టెన్ల జాబితాలో ఉన్నారు.
ఇదిలావుంచితే.. దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 ఫార్మాట్‌కు ఎంపికయ్యారు. చివరిసారిగా నవంబర్ 2022 తర్వాత తిరిగి ఆఫ్ఘనిస్థాన్‌పై సిరీస్‌కు ఎంట్రీ ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని వీరిద్దరికీ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇక మొహాలి వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రోహిత్ శర్మ సున్నా పరుగుల వద్ద డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ శివమ్ దూబే రాణించడంతో 159 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. జనవరి 14న ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.