Ayodhya Ram Mandir: రామమందిర ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై మండిపడ్డ దిగ్విజయ్ సింగ్ సోదరుడు
- దివంగత రాజీవ్ గాంధీ ఆలయ తాళాలు తెరిచారని గుర్తు చేసిన లక్ష్మణ్ సింగ్
- రామమందిరం గురించి పోరాడిన వారే ప్రాణప్రతిష్ఠకు నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్య
- అందరివాడైన రాముడి ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదన్న దిగ్విజయ్ సింగ్ సోదరుడు
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ పండుగను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించడంపై ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు వెళ్లవద్దని ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతూ, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. ఈ మేరకు లక్ష్మణ్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ... దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఆలయ తాళాలు తెరిచారని... నాటి యూపీ సీఎం బహదూర్ సింగ్ రామమందిర నిర్మాణం గురించి మాట్లాడారని గుర్తు చేశారు. కానీ దురదృష్టవశాత్తూ బహదూర్ సింగ్ ఆ తర్వాత పదవిని కోల్పోయారన్నారు. రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డారని.. దీంతో ఈ అంశం పెండింగ్‌లో పడిందన్నారు.
ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు ఉద్యమాన్ని కొనసాగించారని.. ఆ ఉద్యమంలో మేధావులతో పాటు ఎందరో చేరినట్లు తెలిపారు. రామమందిరం గురించి పోరాడిన వారే ప్రాణప్రతిష్ఠకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని గుర్తించాలని తెలిపారు. అందుకే వారే నిర్ణయం తీసుకున్నారని.. కానీ ఆహ్వానించినప్పుడు తిరస్కరించడంలో అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. ఇలా తిరస్కరించడం ద్వారా ప్రజల్లోకి మనం ఎలాంటి సందేశం పంపిస్తున్నాం? అని నిలదీశారు. ఆలయ తాళాలు రాజీవ్ గాంధీయే తెరిచారని.. అలాంటప్పుడు మనం ఆహ్వానాన్ని తిరస్కరించడమేమిటి? ఈ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని హెచ్చరించారు.
సోదరుడు దిగ్విజయ్ సింగ్ గురించి ఏమన్నారంటే...?
ప్రాణప్రతిష్ఠ అంశంపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా లక్ష్మణ్ సింగ్ స్పందించారు. తన సోదరుడు మహాజ్ఞాని... నా కంటే ఎక్కువగా తెలుసు... అతని గురించి నేను మాట్లాడలేను అన్నారు. ప్రతి ఒక్కరు అయోధ్యకు వెళ్లాలని... మేం కూడా అక్కడకు వెళ్తామన్నారు. రాముడిపై మాత్రం తమకు భక్తి ఉందన్నారు.