Gummanuru Jayaram: ఎన్నికలకు సమయం ఉంది... ఈ లోపు ఏదైనా జరగుతుందేమో!: మంత్రి గుమ్మనూరు జయరాం
- నిన్న మూడో జాబితా ప్రకటించిన వైసీపీ
- మంత్రి గుమ్మనూరు జయరాంకు స్థానచలనం
- కర్నూలు ఎంపీ స్థానం ఇన్చార్జిగా నియామకం
- నేడు కార్యకర్తలతో మంత్రి జయరాం సమావేశం
- మంత్రి ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్న కార్యకర్తలు
వైసీపీ నాయకత్వం రాష్ట్రంలోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇతర నియోజకవర్గాలకు మార్చుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు మంత్రులకు కూడా స్థానచలనం తప్పడంలేదు. మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి కూడా ఇంతే.
ఆయన గత ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ నాయకత్వం ఈసారి ఆయనకు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించింది. ఈ నేపథ్యంలో, అందరు అసంతృప్తుల్లాగానే మంత్రి గుమ్మనూరు జయరాం కూడా తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఎంపీగా పోటీ చేయాలన్న పార్టీ హైకమాండ్ నిర్ణయంపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎంపీ బరిలో దిగాలా, లేక, మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలా అనేది కార్యకర్తలే తేల్చాలని చెప్పారు.
మంత్రి గుమ్మనూరు జయరాం ఈసారి కూడా ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. జయరాంకు ఆలూరు టికెట్ ఇవ్వాలంటూ విజయవాడలో ధర్నా చేస్తామంటూ కార్యకర్తలు ముందుకు వచ్చారు. కార్యకర్తల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్నికలకు సమయం ఉందని, ఈలోపు ఏదైనా జరుగుతుందేమో చూద్దాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇంకా రెండు నెలలు ఉంది కదా అని వ్యాఖ్యానించారు.