Rayapati Rangarao: టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబు, లోకేశ్ లపై విరుచుకుపడిన రాయపాటి రంగారావు
- టీడీపీకి గుడ్ బై చెప్పిన గుంటూరు నేత రాయపాటి రంగారావు
- చంద్రబాబు ఫొటో నేలకేసి కొట్టిన రంగారావు
- చంద్రబాబు, లోకేశ్ దొంగలు అంటూ విమర్శలు
- లోకేశ్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తానంటూ వ్యాఖ్యలు
గుంటూరు టీడీపీ నేత రాయపాటి రంగారావు ఇవాళ రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. తండ్రీకొడుకులు ఇద్దరూ దొంగలని అభివర్ణించారు. తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను ఎత్తి నేలకేసి కొట్టారు.
టీడీపీలో చేరినప్పటి నుంచి తమను ఎంతో హింస పెట్టారని, ఎన్నికల కోసం రూ.150 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తమ వద్ద ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో అన్ని వివరాలు ఉన్నాయని రాయపాటి రంగారావు స్పష్టం చేశారు. తమ వంటి వాళ్లకు ఏదైనా సాయం చేయాలి కానీ, వారు తమను నాశనం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం, సోమవారం అని చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు.
"అదొక పార్టీ కాదు, వాళ్లు ఉత్త బేవార్స్. ఆ పార్టీ ఉన్నది ప్రజల కోసం కాదు... వాళ్ల కోసం. ఆ పార్టీ... వాళ్ల బాగు కోసం, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యాపార సంస్థ. లక్ష ఉద్యోగాలు తెచ్చాం అని లోకేశ్ చెబుతుంటాడు, కియా తెచ్చాం అంటాడు. మరి కియా తెస్తే అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? శ్రీ సిటీ తెచ్చాం అన్నారు... మరి రాయలసీమలో ఎందుకు గెలవలేకపోయారు. కేవలం 3 సీట్లకే పరిమితం అయ్యారు.
ఏం... నువ్వు ఎందుకొచ్చావ్ మంగళగిరి? మీ ఇల్లెక్కడ... దమ్ము, ధైర్యం ఉంటే మీ రాయలసీమలో పోటీ చేయ్! మీ కులస్తులు అక్కడ లేరా? మంగళగిరిలో నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా...!" అంటూ రాయపాటి రంగారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.