LK Advani: ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోదీపై ఎల్‌కే అద్వానీ ప్రశంసల జల్లు.. అయోధ్య ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న బీజేపీ కురువృద్ధుడు!
- అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆ రాముడే ఎంచుకున్నారని పొగడ్తలు
- రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందంటూ వ్యాఖ్యానించిన బీజేపీ దిగ్గజం
- ‘రథయాత్ర’ ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని భావించలేదన్న బీజేపీ అగ్రనేత
రామజన్మభూమి ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని విధి నిర్ణయించిందని, ఆలయ పునర్మిర్మాణానికి తన భక్తుడైన ప్రధాని మోదీని భగవంతుడు శ్రీరాముడు ఎంచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ‘రాష్ట్ర ధర్మ’ అనే మ్యాగజైన్ ప్రత్యేక ఎడిషన్‌కు అద్వానీ ఒక వ్యాసాన్ని రాశారు. ‘రామ్ మందిర్ నిర్మాణ్.. ఏక్ దివ్య స్వప్న కి పూర్తి’ అనే శీర్షికతో రాసిన ఈ వ్యాసం జనవరి 16న ప్రచురితం కానుంది. కాగా ఈ నెల 22న అయోధ్యలో జరిగే ‘ప్రాణప్రతిష్ఠ’ వేడుకకు అద్వానీ హాజరయ్యే అవకాశాలున్నాయి.
దాదాపు 33 ఏళ్ల క్రితం రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన 'రథయాత్ర' గురించి అద్వానీ తన వ్యాసంలో ప్రస్తావించారు. అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనదని, పరివర్తన కలిగించిన ఘట్టమని తాను భావిస్తున్నానని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా అద్వానీ గుర్తు చేసుకున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి తాను లేనని అటల్ బిహారీ వాజ్‌పేయి బాధపడుతుంటారని వ్యాఖ్యానించారు. రథయాత్ర 33 ఏళ్లు పూర్తి చేసుకుందని, సెప్టెంబర్ 25, 1990న ఉదయం ప్రారంభించిన రథయాత్ర దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారుతుందని తమకు తెలియదని అన్నారు.
శ్రీరాముడిపై ఉన్న విశ్వాసంతో ఉద్యమం ఉద్ధృతం అయిందని వ్యాఖ్యానించారు. రథయాత్ర ఆసాంతం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తన వెంటే ఉన్నట్టు అద్వానీ వ్యాసంలో రాసుకొచ్చారని తెలుస్తోంది. అప్పటికి ప్రధాని మోదీకి అంత గుర్తింపు లేదని, కానీ ఆ సమయంలోనే రాముడు తన ఆలయ పునర్నిర్మాణానికి తన భక్తుడిని (మోదీ) ఎంచుకున్నాడని వ్యాసంలో పేర్కొన్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగా జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.