Dil Raju: బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు: 'గుంటూరు కారం' టాక్ పై దిల్ రాజు
- ఈ నెల 12న రిలీజైన గుంటూరు కారం
- మహేశ్ సినిమాకు నెగెటివ్ రివ్యూల తాకిడి
- కలెక్షన్స్ చూసిన తర్వాత మాట్లాడితేనే బాగుంటుందన్న దిల్ రాజు
- మొదట నెగెటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయిన సినిమాలున్నాయని వెల్లడి
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వస్తుండడంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గుంటూరు కారం చిత్రాన్ని తాను కూడా చూశానని వెల్లడించారు.
మధ్యాహ్నం ఒంటి గంట షో తర్వాత కొన్ని మిక్స్డ్ రివ్యూలు వచ్చాయని తెలిపారు. కొందరు ఫర్వాలేదన్నారని, మరికొందరు యావరేజి అని చెప్పారని, ఇంకొందరు బాగుందని అన్నారని దిల్ రాజు వివరించారు. అయితే, గుంటూరు కారం సినిమా చూసినప్పుడు తాను పర్సనల్ గా ఏం ఫీల్ అయ్యానో, దాన్ని మళ్లీ క్రాస్ చెక్ చేసుకోవడానికి మరోసారి సుదర్శన్ థియేటర్లో సినిమా చూశానని వెల్లడించారు.
"మహేశ్ బాబు క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథతో గుంటూరు కారం చిత్రం తెరకెక్కించారు. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రం. తల్లీకొడుకుల మధ్య భావోద్వేగాలను చూపించారు. ఒక్కో షో ప్రదర్శించే కొద్దీ ఈ సినిమా పుంజుకుంటుంది. ముఖ్యంగా, ప్రేక్షకులు నెగెటివ్ ప్రచారం నుంచి, నెగెటివ్ రివ్యూల నుంచి, నెగెటివ్ టాక్ నుంచి బయటికి వచ్చి సినిమా చూస్తే కొత్తగా ఉంటుంది. మొదట నెగెటివ్ టాక్ వచ్చి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఎన్నో సినిమాలు ఉన్నాయి.
గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టయినర్. ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా అందరూ చూసి ఆస్వాదించదగ్గ సినిమా. నేను సుదర్శన్ థియేటర్ లో చూసినప్పుడు కూడా అదే ఫీలయ్యాను. మహేశ్ బాబు క్యారెక్టర్ ను గానీ, త్రివిక్రమ్ డైలాగులను కానీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుండడాన్ని గమనించాను. ఎమోషన్స్, మాస్ సాంగ్... ఇలా అన్ని అంశాలకు వచ్చే రెస్పాన్స్ చూస్తే ఇదొక పాజిటివ్ ఫిల్మ్.
ఇక, నెగెటివ్ టాక్ అనేది ఎప్పుడు పోతుందంటే... సినిమా కలెక్షన్స్ వివరాలు వెల్లడైనప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు వచ్చిన మహేశ్ బాబు చిత్రం ఎంత వసూలు చేసింది, గుంటూరు కారం చిత్రం ఎంత వసూలు చేసిందన్న దాన్నిబట్టి ఓ అంచనాకు రావొచ్చు. అందుకే ఈ పండుగ నాలుగు రోజులు అయిపోయాక కలెక్షన్స్ చూసే వరకు ఎవరి గురించి కామెంట్ చేయకూడదు. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. బాగుండే సినిమాను ఎవరూ ఆపలేరు. చరిత్ర చెప్పేది అదే.
సంక్రాంతి అంటే మాకు యుద్ధం జరగడం కామన్. ఎందుకంటే ఇది వ్యాపారం. అంతమాత్రాన ఇక్కడ ఎవరికి ఎవరూ శత్రువులు కారు. వ్యాపారపరంగా మాకు సవాళ్లు ఎదురవుతుంటాయి కాబట్టి కొన్ని పరిస్థితులు వస్తుంటాయి" అని దిల్ రాజు వివరించారు