Chiranjeevi: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చిరంజీవికి ఆహ్వానం
- అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామ మందిర నిర్మాణం
- ఈ నెల 22న ఆలయ ప్రాణ ప్రతిష్ట
- దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు
- చిరంజీవి నివాసానికి వచ్చి ఆహ్వానపత్రం అందించిన వీహెచ్ పీ నేతలు
అయోధ్యలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామ మందిరం జనవరి 22న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. దాదాపు ఆరు వేల మంది అతిథుల నడుమ ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాలంటూ విశ్వహిందూ పరిషత్ జాతీయనేత గుర్రం సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశిధర్ రావినూతల నేడు చిరంజీవికి ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అంశాలు ఎన్నో వందల ఏళ్ల నిరీక్షణకు కార్యరూపం అని అభివర్ణించారు. ఇటువంటి ఒక చారిత్రక ఘట్టంలో పాలుపంచుకోవడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి తాను సతీసమేతంగా హాజరవుతున్నానని పేర్కొన్నారు.