Parliament Breach Probe: పార్లమెంట్ భద్రతా వైఫల్యం..కుట్రకు మాస్టర్ మైండ్ ఎవరో నార్కో పరీక్షల్లో వెల్లడి
- నిందితులకు గుజరాత్‌లో నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షలు
- నిందితురాలు నిలమ్ మినహా మిగతా వారందరికీ నార్కో పరీక్షలు నిర్వహించిన వైనం
- ఘటనకు మాస్టర్ మైండ్ మనోరంజన్. డి అని తేలినట్టు వెల్లడించిన పోలీసు వర్గాలు
పార్లమెంటు భద్రతా వైఫల్యం కేసుకు సంబంధించి జరిపిన నార్కో పరీక్షల్లో మాస్టర్ మైండ్ ఎవరో వెల్లడైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 13న పార్లమెంటులోకి దూసుకొచ్చిన డి. మనోరంజన్ ఈ కుట్రకు సూత్రధారిగా పాలీగ్రాఫ్, నార్కో పరీక్షల్లో తేలినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లలిత్ ఝా అసలు మాస్టర్ మైండ్ అని పోలీసులు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితులుగా ఉన్న సాగర్ శర్మ మనోరంజన్. డి. అమోల్ షిండే, నీలమ్ ఆజాద్, లలిత్ ఝా, మహేశ్ కుమావత్‌ను పోలీసులు శనివారం పాటియాల హౌస్ కోర్టులో హాజరుపరచగా నిందితులకు న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. ఈ క్రమంలో నీలమ్ మినహా ఇతరులకు నార్కో పరీక్షలు నిర్వహించారు. నీలమ్ మాత్రం ఈ పరీక్షలకు అంగీకరించలేదు. డిసెంబర్ 8న గుజరాత్‌లో నార్కో పరీక్షలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. సాగర్, మనోరంజన్‌కు అదనంగా బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష కూడా నిర్వహించారు.
ఇప్పటి వరకూ దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఇవే..
దేశంలో నిరుద్యోగిత, మణిపూర్ సంక్షోభం, రైతుల నిరసనల నేపథ్యంలో నిందితులు ప్రభుత్వానికి ఓ సందేశం పంపించేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సూత్రధారి మనోరంజన్‌యేనని నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల్లో తేలినట్టు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని ప్రశ్నించాల్సి ఉందని, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా రావాల్సి ఉందని చెప్పారు.
ఈ ఘటనలో నిందితులు మనోరంజన్.డి, సాగర్ శర్మ జీరో అవర్ సందర్భంగా పబ్లిక్ గ్యాలరీలోంచి సభ మధ్యలోకి ఒక్కసారిగా దూకి పెద్దపెట్టున నినాదాలు చేస్తూ గ్యాస్ క్యానిస్టర్లు వదిలారు. మరోవైపు, పార్లమెంటు బయట అమోల్ షిండే, నీలమ్ అజాద్ గ్యాస్ క్యానిస్టర్లు వదిలారు.