Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం మతపరమైన సమస్య కాదు.. జాతీయ సమస్య: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి తిరిగి గౌరవం ఇచ్చేందుకే ఆలయ నిర్మాణ ఉద్యమం జరిగిందన్న బీజేపీ అగ్రనేత
- రాముడి జన్మ స్థలంలో మందిర నిర్మాణం గర్వకారణమని వ్యాఖ్య
- అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠాపన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
అయోధ్య ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధమవుతోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో కార్యక్రమాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య మందిరం మతపరమైన సమస్య కాదని, జాతీయ సమస్య అని అన్నారు. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి తిరిగి గౌరవం ఇచ్చేందుకే ఆలయ నిర్మాణ ఉద్యమం జరిగిందన్నారు. రాముడు జన్మించిన స్థలంలో రామమందిరం నిర్మాణం దేశంలో నివసించే వారందరికీ గర్వం కారణమని, ఆత్మగౌరవానికి చిహ్నమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఈ సమస్య మతపరమైనదో, ఏ కులానికో సంబంధించినది కాదని, ఇది జాతీయ సమస్య అని అన్నారు.
అయోధ్య ఉద్యమం దేవాలయ నిర్మాణం కోసం మాత్రమే కాదని, దేశంలో అందరికీ న్యాయం జరిగేలా, అందరూ శాంతియుతంగా ఉండేలా అవగాహన కల్పించడం ఈ ఉద్యమం ఉద్దేశమని అన్నారు. హిందుత్వం దేశ చరిత్ర అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ చేపట్టిన ‘రథయాత్ర’ను గుర్తుచేసుకున్నారు. రథయాత్ర అయోధ్య రామమందిర నిర్మాణాన్ని దేశం ముందు ఉంచిందని అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిన వారిని గడ్కరీ గుర్తు చేసుకున్నారు.
వీహెచ్‌పీకి చెందిన అశోక్ సింఘాల్, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి, సాధ్వి రితంభర, పలువురు సాధువులు, శంకరాచార్యులు ఇందుకోసం కృషి చేశారని చెప్పారు. రామజన్మభూమికి సంబంధించి 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గడ్కరీ గుర్తుచేసుకున్నారు. చరిత్ర, సత్యం, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయం జరగాలని దేశం ఎదురుచూసిందని, రాముడి భక్తులందరికీ అత్యున్నత కోర్టు న్యాయం చేసిందని అన్నారు. శ్రీరాముడి జన్మస్థలంలో భారీ ఆలయాన్ని నిర్మిస్తుండడం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. జనవరి 22 నుంచి భక్తులకు రామయ్య దర్శన భాగ్యం దక్కుతుందని అన్నారు.