Adidas CEO: 60 వేల మంది ఉద్యోగులతో తన ఫోన్ నెంబర్ పంచుకున్న అడిడాస్ సీఈఓ! ఎందుకంటే..

Adidas CEO Gave His Phone Number To 60 000 Employees

  • జర్మన్ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ అడిడాస్ కష్టాల్లో ఉండగా సీఈఓ బాధ్యతలు తీసుకున్న బ్యోర్న్ గుల్డెన్ 
  • సీఈఓ అయిన వెంటనే తప్పులు చేస్తున్న కన్సల్టెంట్ల తొలగింపు
  • పారదర్శకత పెంచేందుకు తన ఫోన్ నెంబర్‌ను 60వేల మంది ఉద్యోగులకు ఇచ్చిన వైనం
  • సీఈఓగా మారిన ఏడాదిలోపే సంస్థను కష్టాలనుంచి గట్టెక్కించిన బ్యోర్న్
  • ఈ ఏడాది నుంచి అడిడాస్ లాభాల బాట పడుతుందని వెల్లడి

జర్మనీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్ సీఈఓ బ్యోర్న్ గుల్డెన్ తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత పెంపొందించేందుకు తన ఫోన్ నెంబర్‌ను సుమారు 60 వేల మంది ఉద్యోగులకు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఫలితంగా వారంలో తనకు ఉద్యోగుల నుంచి 200కు పైగా ఫోన్ కాల్స్ వచ్చేవని చెప్పారు. 

2023లో అడిడాస్ కష్టాల కడలిలో ఉన్న సమయంలో బ్యోర్న్ గుల్డెన్ సంస్థ పగ్గాలు చేపట్టారు. అప్పటికే సంస్థ నష్టాల్లో ఉంది. అంతకుముందు ఏడాది చివరి త్రైమాసికంలో 724 మిలియన్ యూరోల నిర్వహణ నష్టాలు మూటగట్టుకుంది. పైపెచ్చు, అమెరికన్ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌తో యీజీ స్పోర్ట్స్ వేర్ అమ్మకాలకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా అడిడాస్ రద్దు చేసుకుంది. అప్పటికి సంస్థ వద్ద యీజీ బ్రాండ్‌కు చెందిన ఒక బిలియన్ డాలర్ల విలువైన యీజీ స్నీకర్స్ అమ్మడుపోక మిగిలిపోయాయి. 

ఇలాంటి సమయంలో అడిడాస్ ను గాడిలో పెట్టేందుకు బ్యోర్న్ రంగంలోకి దిగారు. స్వయంగా ఫుట్ బాలర్ అయిన ఆయన తన అనుభవాన్నంతా ఉపయోగించి సంస్థను కష్ఠాల నుంచి గట్టెక్కించారు. తొలుత అడిడాస్‌ను తప్పుదారి పట్టించిన పలు కన్సల్టెంట్లను ఆయన తొలగించారు. స్పోర్ట్స్ పర్సన్ ఎవరూ చేయని తప్పులు వారు చేశారని ఆయన ఆరోపించారు. సంస్థ తిరోగమనంలో ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోలేని వారితో తనకు సవాళ్లు ఎదురయ్యాయని మీడియాకు చెప్పారు. 

బ్యోర్న్ అడిడాస్ పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తోంది. అయితే, ఈ ఏడాది సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బ్యోర్న్ సీఈఓ అయిన నాటి నుంచి అడిడాస్ షేర్ విలువ రెండింతలైంది. తన ప్రత్యర్థి నైకీకంటే అధిక వృద్ధి సాధించింది. సంస్థను లాభాల బాట పట్టించే క్రమంలో బ్యోర్న్ అడిడాస్‌ను క్రికెట్‌ క్రీడకూ దగ్గర చేశారు. 2023లో భారత క్రికెట్ టీంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియా వంటి దేశాల్లో క్రికెట్‌ అభిమానం కారణంగా అడిడాస్.. ఈ ఒప్పందం కుదుర్చుకున్న మూడు నెలల వ్యవధిలోనే 6 లక్షల జర్సీలను అమ్మింది. 

కాగా, అమ్ముడు కాక మిగిలిపోయిన యీజీ స్నీకర్స్ సమస్య తనను మొదట్లో ఇబ్బంది పెట్టిందని బ్యోర్న్ చెప్పారు. చివరకు వాటిని అమ్మకానికి పెట్టిన ఆయన అలా వచ్చిన ఆదాయాన్ని జాతివిద్వేషంపై పోరాడుతున్న స్వచ్ఛంధ సంస్థలతో పంచుకున్నారు. యీజీ సంస్థతో అడిడాస్ కుదుర్చుకున్న ఒప్పందం..స్పోర్ట్స్ ప్రపంచం చూసిన అతిపెద్ద అగ్రిమెంట్స్‌లో ఒకటని వ్యాఖ్యానించారు. ఓ కాంట్రవర్సీ కారణంగా ఈ ఒప్పందం ముగిసిపోవడంపై విచారం కూడా వ్యక్తం చేశారు. అయితే, ఒప్పందం ముగింపుతో మిగిల్చిన ఖాళీని కొత్త తరహా చిన్న స్నీకర్స్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తానని బ్యోర్న్ చెప్పారు.

  • Loading...

More Telugu News