Oil Price Hike in India: భారత్‌లో ఇంధన ధరలు పెరగొచ్చు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చీఫ్ హెచ్చరిక

Red Sea crisis will lead to oil price hike in India World Economic Forum chief

  • దావోస్‌లో నేడు ప్రారంభంకానున్న డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశం
  • మీటింగ్‌కు ముందు భారత మీడియాతో ముచ్చటించిన డబ్ల్యూఈఎఫ్ చీఫ్ బ్రెండ్
  • ఎర్ర సముద్రంలో హౌతీల దాడులపై డబ్ల్యూఈఎఫ్ చీఫ్ ఆందోళన
  • భారత్ వంటి చమురు దిగుమతి దేశాల్లో ఇంధన ధరలు పెరగొచ్చని హెచ్చరిక
  • అంతర్జాతీయంగా భారత్ పరపతి పెరుగుతోందంటూ ప్రశంస

ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) చీఫ్ బోర్జ్ బ్రెండ్ హెచ్చరించారు. భారత్ వంటి చమురు దిగుమతి దేశాల్లో బ్యారెల్ చమురు ధర 10 నుంచి 20 డాలర్ల వరకూ పెరగొచ్చని హెచ్చరించారు. నేడు దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన జాతీయ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 

గతేడాది ప్రపంచ వాణిజ్య వృద్ధిలో 0.8 శాతం మేర కోత పడిందని చెప్పారు. అయితే, ఈ ఏడాది వాణిజ్యం ఎంతోకొంత ఊపందుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత ముదరకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. 

దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ..
ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉందని బోర్జ్ అంచనా వేశారు. వచ్చే దశాబ్దం లేదా రెండు దశాబ్దాల్లో భారత్‌లో 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరగొచ్చని అన్నారు. సేవల ఎగుమతులు, డిజిటల్ ఆర్థికవ్యవస్థ వృద్ధిలో భారత్ అగ్రభాగాన ఉందని వివరించారు. అయితే, దేశంలో విద్య, వాణిజ్య, ప్రభుత్వ వ్యవహారాల్లో సంస్కరణలు మాత్రం కొనసాగాలని సూచించారు. ప్రపంచంలో భారత్‌ పరపతి పెరుగుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందన్నారు. 

ఆర్థికాభివృ‌ద్ధి కోసం ప్రపంచ దేశాల మధ్య నమ్మకం పెంచే చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూఈఎఫ్ చీఫ్ బోర్జ్ అభిప్రాయపడ్డారు. కరోనా లాంటి సంక్షోభాలు, వాతావరణ మార్పులు, సైబర్ దాడులు, గాజాలో చూస్తున్న యుద్ధం వంటి అంతర్జాతీయ విపత్తులను దీటుగా ఎదుర్కొన్నేందుకు వివిధ దేశాల మధ్య భాగస్వామ్యాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు ఇది కీలకమని చెప్పారు.

  • Loading...

More Telugu News