ias: తెలంగాణలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా
- తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఐఏఎస్ పోస్టుల భర్తీ
- నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటా కింద ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా
- సీతాలక్ష్మీ, ఫణీందర్ రెడ్డిలను ఐఏఎస్ లు గా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ
తెలంగాణకు చెందిన ఇద్దరు అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు రాష్ట్ర సర్వీస్ అధికారులకు ఐఏఎస్ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్ రెడ్డిలను ఐఏఎస్‌లుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఐఏఎస్ పోస్టులను నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటా కింద భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 మంది సీనియర్ అధికారుల జాబితాను కేంద్రానికి గతంలోనే పంపించింది. అప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఒమర్ జలీల్, హర్విందర్ సింగ్ రిటైర్ అయ్యారు. వీరి స్థానాలను నాన్ రెవెన్యూ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెవెన్యూ, వ్యవసాయం, అడవులు, విద్యాశాఖల నుంచి కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తోన్న సీనియర్ అధికారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు ఐదుగురి చొప్పున.. మొత్తం పది పేర్లను డీవోపీటీకి పంపించింది.