KTR Tweet: వస్త్ర పరిశ్రమను ఆదుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి
- పదేళ్లలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి పథంలో సాగిందన్న మాజీ మంత్రి
- నేతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని వివరణ
- సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ మూసివేతపై కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో చేనేత రంగానికి గత ప్రభుత్వం అండగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. గడిచిన పదేళ్లలో వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు. ప్రభుత్వ సహకారంతో ఉపాధి పొందడంతో పాటు నైపుణ్యం కలిగిన నేతన్నలు తయారయ్యారని చెప్పారు. అలాంటి వస్త్ర పరిశ్రమ సంక్షోభం దిశగా సాగడం విచారకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ నిరవధికంగా మూతపడడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి ట్వీట్ చేశారు. ఈమేరకు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్స్ ను షేర్ చేశారు.
పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేతలకు సాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించాలని, వస్త్ర పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడుతుందని కేటీఆర్ అన్నారు.