Robot: చొక్కా మడతపెట్టిన మస్క్ రోబో.. వీడియో ఇదిగో!

Elon Musk Says His Robot Folds A Shirt Like Human

  • వీడియో ట్వీట్ చేసిన టెస్లా కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్
  • త్వరలో తనకు తానుగా పనులు చేసే రోబోలు వస్తాయని ఆశాభావం
  • కొత్తతరం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తున్న టెస్లా 

హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. టెస్లా తయారుచేసిన కొత్తతరం హ్యూమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో ఆప్టిమస్ రోబో ఓ చొక్కాను మడతపెడుతున్న దృశ్యం చూడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకుతానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదని చెప్పారు. అయితే, త్వరలోనే స్వతంత్రంగా పనులు చేయగలిగే రోబోను తయారుచేయగలమని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఆప్టిమస్ ఫోల్డ్స్ ఏ షర్ట్’ పేరుతో మస్క్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పనులు తనకుతానుగా చేసే రోబో త్వరలోనే మానవాళికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. రోబో కదలికలు అచ్చంగా మనుషుల్లానే ఉన్నాయని ఓ యూజర్ కామెంట్ చేయగా.. చాలా నెమ్మదిగా పనిచేస్తోందని ఆ రోబోను పక్కకు నెట్టి సదరు చొక్కాను మా అమ్మే మడతపెట్టేసిందని మరో యూజర్ కామెంట్ చేశాడు. కాగా, దాదాపు నెల రోజుల క్రితం కూడా మస్క్ ఇలాంటి వీడియోను షేర్ చేశారు. ఆప్టిమస్ రోబో సామర్థ్యాలను తెలిపే ఈ వీడియోలో.. రోబో నడవడం, డ్యాన్స్ చేయడం, కోడి గుడ్డును ఉడికించడం వంటి పనులను చేయడం కనిపించింది.

  • Loading...

More Telugu News