Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పులో ఇద్దరు జడ్జిలు ఏమన్నారంటే...!

Supreme Court refers Chandrababu quash petition before large bench
  • చంద్రబాబుపై స్కిల్ కేసు నమోదు చేసిన సీఐడీ
  • సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
  • విచారణ చేపట్టిన జస్టిస్ బోస్, జస్టిస్ బేలా ధర్మాసనం
  • సెక్షన్ 17ఏపై ఇద్దరి జడ్జిల మధ్య కుదరని ఏకాభిప్రాయం
  • విస్తృత ధర్మాసనం ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్
స్కిల్ కేసులో సీఐడీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. 

అయితే, ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది మధ్య తీర్పులో ఏకాభిప్రాయం కుదరలేదు. విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుధ్ బోస్ పేర్కొనగా, చంద్రబాబుకు 17ఏ వర్తింపజేయలేరని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు. ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు  ఈ కేసు విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనం ముందుకు ప్రతిపాదించింది. ఇరువురు న్యాయమూర్తుల తీర్పులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

జస్టిస్ అనిరుధ్ బోస్ స్పందిస్తూ.. "అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుంది. పదవిలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపితే అది చట్టవ్యతిరేకం అవుతుంది. 1988 చట్టంలోని సెక్షన్ 13(1) (సి), సెక్షన్ 13 (1) (డి), సెక్షన్ 13 (2) కిందికి వచ్చే నేరారోపణలపై తగిన (గవర్నర్) అనుమతులు తీసుకోకుండా చంద్రబాబును విచారించలేరు. ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చు. ఆ మేరకు అనుమతి కోసం సంబంధిత వర్గాలకు దరఖాస్తు చేసుకోవచ్చు" అని వివరించారు.


అయితే జస్టిస్ బేలా త్రివేది తన సహ న్యాయమూర్తి జస్టిస్ అనిరుధ్ బోస్ తీర్పును వ్యతిరేకించారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే 17ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 2018లో చట్ట సవరణ జరగ్గా... అంతకుముందు జరిగిన నేరాలకు దీన్ని వర్తింపజేయలేరని తెలిపారు. అవినీతి ప్రజాప్రతినిధులకు ప్రయోజనం కలిగించడం సెక్షన్ 17ఏ లక్ష్యం కాదని అన్నారు. ఈ సెక్షన్ ను కచ్చితంగా అమలు చేస్తే చాలామంది అసహనానికి గురవుతారు అని వివరించారు.
Chandrababu
Quash Petition
Supreme Court
Skill Development Case
CID
TDP
Andhra Pradesh

More Telugu News