Road Way Kit: అద్భుతమైన రోడ్ వే కిట్... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రోడ్ వే కిట్ వీడియో
- చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయన్న ఆనంద్ మహీంద్రా
- భారత సైన్యం రోడ్ వే కిట్ గురించి ఆలోచించాలని ఆకాంక్ష
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. నదులు, జలాశయాల్లోనూ బురద ప్రాంతాల్లోనూ, ఇసుక తిన్నెలపైనా ఓ కన్వేయర్ బెల్ట్ వంటి ట్రాక్ ను ఉపయోగించుకుని పలు రకాల వాహనాలు సునాయాసంగా ముందుకు వెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. దీన్ని రోడ్ వే కిట్ గా పేర్కొన్నారు.
ఓ జేసీబీ, కొన్ని యుద్ధ ట్యాంకులు, ఇతర వాహనాలు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ తరహా రోడ్ వే కిట్ ను ఉపయోగించుకుని ఎలాంటి అవాంతరాల్లేకుండా ప్రయాణించాయి. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. దీన్ని చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయని తెలిపారు.
ఈ ఐడియాను భారత సైన్యం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. అప్పుడు, మన సైన్యం కఠినమైన ప్రాంతాల్లోనూ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యమవుతుందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటుందని, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు కూడా ఈ వినూత్న ఆవిష్కరణ ఉపయోగపడుతుందని వివరించారు.