Dasoju Sravan: దావోస్ పర్యటనలో అలా చేసి... తెలంగాణ పరువు తీయవద్దు!: రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ సూచన

Dasoju Sravan express his concern regarding CM Revanth Reddy representation in Davos

  • అంతర్జాతీయ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని సూచన
  • అంతర్జాతీయ వేదికలలో చవకబారు వ్యాఖ్యలు ఆపేస్తే మంచిదన్న దాసోజు శ్రవణ్
  • అసలు దావోస్‌లో శ్రీధర్ బాబు పాత్ర ఏమిటి? అని ప్రశ్న

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శలు చేశారు. సదస్సుకు సంబంధించిన ట్వీట్లు, సోషల్‌మీడియా, మీడియా కవరేజీపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదికపై అసంబద్ధమైన, అసమర్థ వ్యాఖ్యలతో రాష్ట్రానికి అపకీర్తి తీసుకురావద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సూచించారు. అర్థంపర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ఎలాంటి ప్రశంసలు తీసుకురావని హితవు పలికారు. కనీసం ఇలాంటి అంతర్జాతీయ ఫోరంలలో అయినా చౌకబారు రాజకీయ వ్యాఖ్యలు ఆపేస్తే మంచిదన్నారు. ప్రపంచ వేదికపై పెట్టుబడుల ఆకర్షణకు... ఆర్థిక విధానాలు, సమర్థత, రాష్ట్రాభివృద్ధిపై ముందుచూపు అవసరమన్నారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘ ట్వీట్ చేశారు.

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి గురించి ట్వీట్లు, సోషల్ మీడియా, మీడియా కవరేజీని గమనించాక ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. అసంబద్ధ, అస్థిరమైన, అసమర్థ వ్యాఖ్యలతో తెలంగాణ పరువు తీయవద్దని, రాష్ట్రానికి అపకీర్తి తీసుకు రావొద్దని ముఖ్యమంత్రికి సూచించారు. న్యూక్లియర్ రియాక్షన్, రింగ్ రోడ్లు, డూప్లికేట్ పొలిటికల్ కామెంట్లు చేస్తే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రశంసలు రావని చురక అంటించారు. సీఎం కనీసం అంతర్జాతీయ వేదికలపై ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు.

పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో దావోస్ సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి ఆర్థిక విధానాలలో సమర్థతను, అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, అనుకూలమైన వ్యాపార వాతావరణ వంటి అంశాలను పేర్కొనాలన్నారు. ప్రభావవంతమైన కమ్యూనికేషన్, వృద్ధి అవకాశాలను వెల్లడించడంతో పాటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడం కూడా ప్రపంచ వేదికపై పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకమే అన్నారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో పై లక్షణాలు కనిపించడం లేదని విమర్శించారు. దీంతో ఆయన పరిపాలనా దృక్పథం లోపంతో పాటు ఆయన లోని అపరిపక్వతను సూచిస్తోందన్నారు.

జయేష్ రంజన్, ఇ.విష్ణువర్ధన్ రెడ్డి వంటి నిపుణులతో కలిసి వెళ్లిన రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడు, ఎలా మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? అనే విషయాలను వారి నుంచి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయన తీరుతో తెలంగాణకు పెట్టుబడులు, రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ఇక, ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన... గత ప్రభుత్వాలలో కేబినెట్ మంత్రిగా పని చేసిన ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాత్ర ఏమిటి? ఆయన అంతగా బయటకు ఎందుకు కనిపించడం లేదు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి అయినందువల్లే దావోస్‌లో ప్రధానంగా కనిపిస్తున్నారని, అదే సమయంలో అనుభవజ్ఞుడైన, సమర్థుడైన శ్రీధర్ బాబును పక్కన పెడుతున్నారన్నారు. అక్కడ అన్నీ తానై కనిపించి తెలంగాణ భవిష్యత్తుకు నష్టం చేసేలా ఉన్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News