Airplane: విమానం టాయిలెట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు.. జర్నీ మొత్తం అందులోనే..!
- స్పైస్ జెట్ విమానంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన
- ముంబై నుంచి బెంగళూరు విమానంలో ప్రయాణికుడికి చేదు అనుభవం
- బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగాక డోర్లు బద్దలు కొట్టి బయటకు తెచ్చిన వైనం
బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. త్వరగా, సౌకర్యవంతంగా వెళ్లొచ్చని విమానం ఎక్కితే.. గంటన్నరకు పైగా టాయిలెట్ లోనే ఉండాల్సి వచ్చింది. టాయిలెట్ డోర్ లాక్ తెరుచుకోకపోవడంతో ఆయన తన గమ్యం చేరేదాకా అందులోనే చిక్కుకుపోయాడు. మంగళవారం ముంబై నుంచి బెంగళూరు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుందీ ఘటన.
బాధితుడు, ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు స్పైస్ జెట్ విమానం ఎస్ జి- 268 బెంగళూరు బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు టాయిలెట్ కు వెళ్లాడు. అయితే, మాల్ ఫంక్షన్ కారణంగా డోర్ తెరుచుకోకపోవడంతో లోపలే చిక్కుకు పోయాడు. డోర్ తెరిచేందుకు బయట నుంచి ఫ్లైట్ సిబ్బంది చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి.
దీంతో ఎయిర్ హోస్టెస్ ఓ కాగితంపై నోట్ రాసి డోర్ కింది నుంచి లోపలికి పంపింది. డోర్ బయటి నుంచి కూడా తెరుచుకోవడంలేదని, విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ తెరుస్తారని పేర్కొంది. కాసేపట్లో బెంగళూరులో ల్యాండ్ కాబోతున్నాం.. టాయిలెట్ సీటుపై జాగ్రత్తగా కూర్చొని దెబ్బలు తగలకుండా చూసుకోండని చెప్పింది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండయ్యాక ఇంజనీర్లు వచ్చి డోర్ పగలగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.