KTR: లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్ కు ఎందుకు ఓటు వేయాలంటే...?: కేటీఆర్ ట్వీట్
- పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళాన్ని గట్టిగా, స్పష్టంగా వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనన్న కేటీఆర్
- తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారని ట్వీట్
- బీఆర్ఎస్ ఎంపీలు 16, 17వ లోక్ సభలో 4,574 సార్లు ప్రశ్నించినట్లు వెల్లడి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. 17వ, 18వ లోక్ సభలలో ఏ పార్టీ ఎన్ని ప్రశ్నలు సంధించిందో ఈ ట్వీట్లో వెల్లడించారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళాన్ని గట్టిగా, స్పష్టంగా వినిపించేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని పలుమార్లు ప్రశ్నించినట్లు తెలిపారు.
16, 17వ లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్రశ్నించగా, కాంగ్రెస్ 1271 సార్లు, బీజేపీ 190 సార్లు మాత్రమే ప్రశ్నించినట్లు గణాంకాలు చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని... 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం… తెలంగాణ దళం.. మనమే.. అని కేటీఆర్ పేర్కొన్నారు.