BRS: ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్... మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కేసు
- గత ఏడాది కారు వేగంగా నడుపుతూ ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన షకీల్ తనయుడు రహీల్
- దుబాయ్ పారిపోయిన రహీల్‌కు లుకౌట్ నోటీసుల జారీ
- కేసు నుంచి కొడుకును తప్పించేందుకు షకీల్ ప్రయత్నించినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్! ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కుమారుడు రహీల్ గత నెల కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కొడుకును తప్పించేందుకు షకీల్ ప్రయత్నించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. ఈ క్రమంలో రహీల్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌కు నోటీసులు ఇచ్చారు. కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్రయత్నించిన షకీల్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
షకీల్ కుమారుడు రహీల్ దుబాయ్ పారిపోయేందుకు పదిమంది సహాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో అర్బాజ్, సాహిల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని రిమాండ్‌కు తరలించారు. రహీల్‌కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌లో ఉన్న అతనిని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ కూడా ఇప్పటికే దుబాయ్‌లో ఉన్నారు.