Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ బహిరంగ లేఖ
- సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి
- ఏడేళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడిందని గుర్తు చేసిన సంజయ్
- వారికి రూ.220 కోట్ల బకాయిలు చెల్లించి ఆదుకోవాలని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని తన లేఖలో కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఈ రంగంపై 20వేల మంది కార్మికులు ఆధారపడ్డారని.. వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో 33వేల మరమగ్గాలు ఉన్నాయని... కానీ ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర రాకపోవడం, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు గత బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు.
గత ఏడేళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.220 కోట్ల మేర బకాయి పడిందన్నారు. ఈ బకాయిలు రాకపోవడంతో ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. బకాయిలు చెల్లిస్తామని కేటీఆర్ గతంలో పలుమార్లు హామీ ఇచ్చినా నెరవేరలేదని... ఎన్నికల సమయంలో కోడ్‌ను సాకుగా చూపారని మండిపడ్డారు. కార్మికులు, పరిశ్రమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారికి బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సిరిసిల్ల కార్మికులు ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడినందున వారికి అలాంటి అవకాశం ఇచ్చి ఆదుకోవాలన్నారు.
సిరిసిల్ల కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు ఎనిమిదేళ్ల క్రితం కేటీఆర్ వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకువచ్చారని... కానీ దానిని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా మీరు ఆ నిధులు కేటాయించి వర్కర్లను ఓనర్లుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డిని కోరారు. ఇక్కడి మరమగ్గాలను ఆధునికీకరించాల్సిన అవశ్యత ఉందని అన్నారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.