Team India: నేడు మూడో టీ20... 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
- బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 3 వికెట్లతో టీమిండియాను దెబ్బకొట్టిన ఫరీద్ అహ్మద్ మాలిక్
టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే టీమిండియా తొలి రెండు టీ20లు గెలిచి సిరీస్ ను 2-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో నేటి మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. సిరీస్ లో చివరిదైన ఈ మ్యాచ్ కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఫ్ఘన్ కొత్త బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను అవుట్ చేసిన మాలిక్.. ఆ తర్వాతి బంతికే కింగ్ కోహ్లీ వికెట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
సాధారణంగా బెంగళూరు స్టేడియం కోహ్లీకి సొంతగడ్డ వంటిది. ఐపీఎల్ లో బెంగళూరు జట్టుకు ఆడే కోహ్లీకి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటి మైదానంలో కోహ్లీ డకౌట్ అయ్యేసరికి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కాసేపటికే ఫామ్ లో ఉన్న శివమ్ దూబేను అజ్మతుల్లా ఒమర్జాయ్ అవుట్ చేయడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓవర్ విసిరిన మాలిక్ సంజు శాంసన్ ను కూడా పెవిలియన్ కు చేర్చి మరో వికెట్ సాధించాడు.
ప్రస్తుతం టీమిండియా స్కోరు 5 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులు కాగా... కెప్టెన్ రోహిత్ శర్మ (8 బ్యాటింగ్), రింకూ సింగ్ (0 బ్యాటింగ్) ఆడుతున్నారు. మాలిక్ 3, ఒమర్జాయ్ 1 వికెట్ తీశారు.