Tamilisai Soundararajan: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తమిళిసై కీలక నిర్ణయం
- దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించిన గత ప్రభుత్వం
- గవర్నర్ తిరస్కరించడంతో కోర్టుకెళ్లిన బీఆర్ఎస్ నాయకులు
- ఈ నెల 24న పిటిషన్ల విచారణ అర్హతపై విచారణ
- హైకోర్టులో తేలే వరకు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయరాదని గవర్నర్ కీలక నిర్ణయం
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ విషయమై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో ఈ అంశం తేలే వరకు నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయరాదని... ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించినట్టు సమాచారం. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణల పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరు కోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ నిర్ణయించారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.
మరోవైపు, గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రెండు ఎమ్మెల్సీ పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై.. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ నిర్ణయించడం గమనార్హం.