Seethakka: ప్రతి సంవత్సరం లాగే మేడారం జాతరకు కేంద్రం నిధులివ్వాలి: తెలంగాణ మంత్రి సీతక్క
- మేడారంకు జాతీయ హోదా ఇవ్వాలన్న సీతక్క
- కిషన్ రెడ్డి ఇందుకోసం కృషి చేయాలని విజ్ఞప్తి
- మేడారంలో శాశ్వత నివాసాలు నిర్మించనున్నట్లు వెల్లడి
ప్రతి సంవత్సరం మేడారం జాతరకు నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఇవ్వాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. బుధవారం మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... కేంద్రం మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని... అందుకోసం తెలంగాణ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు. ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ అన్నారు.
వరదల కారణంగా క్రితంసారి మేడారం జాతర ఛిన్నాభిన్నమైందని... ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. జాతర విజయవంతం కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. భక్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అంచనాల ఆధారంగా రూ.75 కోట్లు, మరో రూ.30 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. శాశ్వత భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తామన్నారు. ఈ ఏడాది జాతర కోసం తాత్కాలిక నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామన్నారు.
మేడారం జాతరలో నిర్మాణాల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విస్మరించిందని ఆరోపించారు. తాము మాత్రం జాతర ఏర్పాట్ల కోసం కావాల్సిన నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జాతరకు 60 రోజుల ముందే తమ ప్రభుత్వం ఏర్పడిందని... అయినా పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. జాతర పనులు, నిర్వహణలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. తామిద్దరం మహిళా మంత్రులం తమ ఇలవేల్పుగా సమ్మక్క సారక్క తల్లులను కొలుస్తామని... అధికారులు సహకరించాలని కోరారు.