Team India: బెంగళూరులో డబుల్ 'సూపర్'... చివరికి టీమిండియానే విన్నర్
- బెంగళూరులో టీమిండియా, ఆఫ్ఘన్ మూడో టీ20
- తొలుత స్కోర్లు సమం
- మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్
- సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం
- దాంతో రెండో సూపర్ ఓవర్ నిర్వహణ... బిష్ణోయ్ మ్యాజిక్
బెంగళూరులో హోరాహోరీగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా 10 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత రెండు సార్లు సూపర్ ఓవర్ లోకి ప్రవేశించడం విశేషం. తొలి సూపర్ ఓవర్ లోనూ స్కోర్లు సమం కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 11 పరుగులు చేయగా, ఆఫ్ఘనిస్థాన్ కేవలం 1 పరుగే చేసి ఓటమిపాలైంది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసి మ్యాజిక్ చేశాడు.
ఈ మ్యాచ్ లో తొలుత టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘన్ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ లోకి మళ్లింది.
ఇక, సూపర్ ఓవర్ లో టీమిండియా లక్ష్యం 17 పరుగులు కాగా... కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం ప్రదర్శించి భారీ సిక్సులు కొట్టాడు. చివరి రెండు బంతుల్లో టీమిండియా విజయానికి 3 పరుగులు అవసరం కాగా... ఐదో బంతికి సింగిల్ తీసిన రోహిత్ శర్మ... జైస్వాల్ కు స్ట్రయికింగ్ ఇచ్చాడు.
అయితే ఆఖర్లో తాను వేగంగా పరిగెత్తలేనేమోనన్న అనుమానంతో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దాంతో రింకూ బ్యాటింగ్ కు వచ్చాడు. ఇక, చివరి బంతికి 2 పరుగులు తీస్తే విజయం లభిస్తుందనగా, క్రీజులో ఉన్న జైస్వాల్ సింగిల్ కొట్టడంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది.