Antony Blinken: బోయింగ్ విమానాల్లో ఆగని సాంకేతిక సమస్యలు.. ఆక్సిజన్ లీకేజీ కారణంగా స్విట్జర్లాండ్‌లో చిక్కుకుపోయిన అమెరికా విదేశాంగమంత్రి
- బోయింగ్ విమానాల్లో వరుసగా వెలుగుచూస్తున్న సమస్యలు
- ఆంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య
- వాయుసేన విమానాన్ని పంపి మంత్రిని వెనక్కి తీసుకొచ్చిన అమెరికా
బోయింగ్ విమానాల్లో ఇటీవల వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో బోల్టులు లూజ్ అయిన ఘటన కలవరపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ విమానాల్లో సంస్థ తనిఖీలు ప్రారంభించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అంతలోనే ఇటీవల కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం డోర్ ఊడి కిందపడింది. జపాన్‌లోని ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం కాక్‌పిట్ అద్దంపై పగుళ్ళు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తాజాగా, ఇప్పుడు అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో ఆక్సిజన్ లీకేజీ సమస్య కలవరపెట్టింది.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన ఆంటోనీ బ్లింకెన్ బుధవారం తిరిగి వాషింగ్టన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్ లీక్ అయింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన అమెరికా ప్రభుత్వం వాయుసేన విమానాన్ని పంపి ఆయనను వెనక్కి తీసుకొచ్చింది.