India - Maldives row: మిలిటరీ ఉపసంహరణపై భారత్, మాల్దీవుల చర్చలు.. ఉగాండాలో జరిగిన కీలక భేటీ

India and Maldives talks on military withdrawal amid Amid Row

  • మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్‌తో ఉగాండాలో సమావేశమైన కేంద్ర మంత్రి జైశంకర్
  • స్పష్టమైన సంభాషణ జరిగిందని వెల్లడించిన భారత విదేశాంగ మంత్రి
  • భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ సహా పలు అంశాలపై చర్చించామన్న మాల్దీవుల మంత్రి

భారత్ - మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో స్తబ్ధత నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. ఉగాండా రాజధాని నగరం కంపాలాలో మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. రెండు రోజుల నామ్ (నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్) శిఖరాగ్ర సదస్సు కోసం వెళ్లిన వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘ఈరోజు కంపాలాలో మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ను కలిశాను. భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది. నామ్ (NAM) సంబంధిత అంశాలను కూడా చర్చించాం’’ అని జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోని కూడా షేర్ చేశారు.

ఇక మూసా జమీర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నామ్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్‌ని కలవడం సంతోషంగా ఉందన్నారు. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, మాల్దీవులలో కొనసాగుతున్న డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, సార్క్, నామ్‌‌ల సహకారంపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం’’ అని ఆయన రాసుకొచ్చారు. సార్క్, నామ్‌ల బలోపేతం, విస్తరణకు మాల్దీవుల సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జైశంకర్‌తో దిగిన ఫొటోని ఆయన షేర్ చేశారు. 

కాగా ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించడంపై మాల్దీవులు మంత్రులు విమర్శలు చేయడం, ప్రతిగా ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ పేరిట భారతీయులు ఎదురుదాడి.. పర్యవసానాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా అనుకూల నాయకుడిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ ఇటీవలే తమ దేశంలోని భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News