Chandrababu: కడప గడ్డపై అడుగుతున్నా... సమాధానం చెప్పే దమ్ముందా జగన్?: చంద్రబాబు
- కమలాపురం సభలో చంద్రబాబు వ్యాఖ్యలు
- జగన్ ఒక్క చాన్స్ అని ఎన్నో కథలు చెప్పాడని విమర్శలు
- వివేకాను ఘోరంగా చంపేశారని ఆరోపణలు
- నాపై కథనం రాశాడీ దుర్మార్గుడు అంటూ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"గత ఎన్నికల సమయంలో ఒక్క చాన్స్ అన్నాడు, ఎన్నో కథలు చెప్పాడు... చివరికి బాబాయ్ హత్య జరిగింది. హూ కిల్డ్ బాబాయ్?... తమ్ముళ్లూ ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు! సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తుంది.
2019 మార్చి 19న వివేకాను ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత డబ్బా సాక్షి చానల్ లో గుండెపోటుతో చనిపోయారని వచ్చింది. రక్తం కనిపించిన తర్వాత మాట మార్చేసి రక్తపు వాంతులు అన్నారు. పోస్టుమార్టం కూడా వీళ్లు వద్దనుకున్నారు.
దీంట్లో ఏదో మోసం ఉందని ఆయన కూతురు పోస్టుమార్టం కోసం పట్టుబట్టింది. దాంతో పోస్టుమార్టం చేయగా, అతి కిరాతకంగా తలపై గొడ్డలితో నరికారన్న విషయం బయటపడింది. ఇష్టంవచ్చినట్టు గొడ్డలితో వేట్లు వేయడంతో మెదడు కూడా బయటికి వచ్చి చెల్లాచెదురైపోయింది! అప్పుడు మళ్లీ మాట మార్చేశారు. నాకు నాన్న లేడు, ఈరోజు బాబాయ్ ని కూడా చంపేశారు... దిక్కులేని బిడ్డను అయిపోయాను అంటూ జగన్ మోహన్ రెడ్డి కొత్తనాటకం ఆడాడు.
కడప గడ్డ మీద నుంచి అడుగుతున్నా... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ మోహన్ రెడ్డికి ఉందా? ఆ తర్వాత సాక్షి పేపర్ లో నారాసుర రక్తచరిత్ర అని కత్తి నా చేతిలో పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు" అంటూ నిప్పులు చెరిగారు.