Narendra Modi: చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ
- షోలాపూర్ లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లను అందించిన మోదీ
- చిన్నతనంలో ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే అలోచన వస్తోందని భావోద్వేగం
- 22వ తేదీన అందరూ ఇంట్లో రామజ్యోతి వెలిగించాలని పిలుపు
మహారాష్ట్రలోని షోలాపూర్ లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని మోదీ ఈరోజు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యంనాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. తన చిన్నతనంలో తనకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తోందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని ఈరోజు ప్రారంభించామని.. 2014లో తాను ఇచ్చిన హామీ నెరవేరడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు.
ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. మన విలువలు, కట్టుబాట్లను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని... ఆయన నిజాయతీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. రాముడి బాటలో నడుస్తూ... పేదల సంక్షేమం, వారి సాధికారిత కోసం పని చేస్తున్నామని అన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేదే తమ కోరిక అని చెప్పారు.