Ayodhya Ram Mandir: శ్రీ రాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రదేశం నుండి అయోధ్యకు రేగు పండ్లు!

Devotees from Chhattisgarh bring Sweet Ber fruit to Ayodhya ahead of Pran Pratishtha Day
  • ఛత్తీస్‌గఢ్‌లోని శివ్రీనారాయణ ప్రాంతం నుంచి రేగు పండ్లు తీసుకొచ్చి ఇచ్చిన భక్తులు
  • రామమందిర ట్రస్టుకు పండ్ల అందజేత
  • శివ్రీనారాయణ ప్రాంతంలోనే రాముడికి శబరి పండ్లు తినిపించిందని స్థానికుల విశ్వాసం
  • శ్రీరాముడి మాతామహుల స్వస్థలం శివ్రీనారాయణ ప్రాంతమేనంటున్న స్థానికులు
అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ శక్తి మేరకు కానుకలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..శ్రీరాముడికి భక్త శబరి పండ్లు తినిపించిన ప్రాంతం నుంచి రేగు పళ్లను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. చంపా జిల్లాలోని శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన 17 మంది ఈ పండ్లను రామ మందిర ట్రస్టు వారికి అందించారు. 

శ్రీరాముడి మాతామహులు..శివ్రీనారాయణ్ ప్రాంతానికి చెందిన వారని స్థానికుల విశ్వాసం. వనవాసం సమయంలో శ్రీరాముడు.. సీతా, లక్షణ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భక్త శబరి మొదట తాను రుచి చూసిన రేగు పండ్లు స్వామికి ఇచ్చిందని కూడా అక్కడి వారు నమ్ముతారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఇక్కడ లభించే తీపి రేగు పళ్లను కానుకగా స్వామివారికి సమర్పించారు. 

‘‘తీపి రేగు పళ్లతో పాటూ శివ్రీనారాయణ్ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఓ ప్రత్యేక మొక్కను కూడా తీసుకొచ్చాము. ఈ మొక్క ఆకులు చిన్న గిన్నె ఆకారంలో ఉంటాయి. శబరి ఈ ఆకులోనే రేగు పళ్లను పెట్టి శ్రీరాముడికి అందించింది’’ అని అనూప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. అయోధ్యలో కూడా ఈ మొక్కలు నాటాలని తాము రామమందిర ట్రస్టుకు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. 

మరోవైపు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రామాయణ పుస్తకాన్ని కానుకగా ఇచ్చేందుకు వచ్చామని అనేమనోజ్ సాటీ భక్తుడు తెలిపారు. ఈ రామాయణం ఖరీదు సుమారు 1.65 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. పుస్తకం డిజైన్, పేపర్ అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు. 

ఇక రామమందిర ప్రారంభోత్సవం రోజున అయోధ్యలో భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. శుక్రవారం తిరుపతి లడ్డూలను విమానంలో అయోధ్యకు తరలించినట్టు తెలిపింది. ఒక్కొక్కటి 25 గ్రాముల బరువుండే లక్ష లడ్డూలను ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పంచేందుకు టీటీడీ నిర్ణయించినట్టు టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మం పేర్కొన్నారు. 

కాగా, గురువారం నాడు రామమందిర గర్భ గుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Uttar Pradesh
Chhattisgarh
Sweet ber

More Telugu News