BJP: అనుచిత వ్యాఖ్యలు... బెదిరింపులు: బీఆర్ఎస్ ఎంపీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు
- చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు
- తనకు బెదిరింపు కాల్ వస్తే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
- బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్లో రంజిత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దూషించాడని శనివారం ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తనకు బెదిరింపు కాల్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫోన్‌లో దూషిస్తూ... బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. ఎంపీ రంజిత్ బీఆర్ఎస్ అయితే, తాను బీజేపీ అని తెలిపారు. ఫోన్ నెంబర్ ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగింది?
ఎంపీ రంజిత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. కొండాకు ఫోన్ చేసిన రంజిత్ రెడ్డి... తన మనుషులను ఎలా కలుస్తారు? అని ప్రశ్నించారు. దీంతో స్పందించిన విశ్వేశ్వర్ రెడ్డి నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లు అని కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో రంజిత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.