Sunil Gavaskar: ఇంగ్లండ్ దగ్గర బజ్‌బాల్ ఉంటే భారత్ వద్ద ఎలాంటి బాల్ ఉందో చెప్పిన సునీల్ గవాస్కర్

India has Viratball to counter England Buzball says Gavaskar

  • ఈ నెల 25న భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు
  • రెండేళ్ల తర్వాత మళ్లీ టెస్టుల్లో తలపడుతున్న ఇరు జట్లు
  • ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద ‘విరాట్‌బాల్’ ఉందన్న గవాస్కర్
  • గత ఒకటి రెండేళ్లుగా ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోందన్న క్రికెట్ లెజెండ్

ఈ నెల 25 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న వేళ టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ దగ్గర ‘బజ్‌బాల్’ ఉంటే భారత్ వద్ద ‘విరాట్‌బాల్’ ఉందని చెప్పుకొచ్చారు. 2021/22లో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ 2-2తో సమం అయిన తర్వాత ఇరు జట్లు మళ్లీ తలపడడం ఇదే తొలిసారి. ఈ నెల 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. 

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మందితో కూడిన భారత జట్టులో కోహ్లీ కూడా ఉన్నాడు. టెస్టుల్లో 9 వేల పరుగులు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డులకెక్కడానికి కోహ్లీకి ఇంకా కావాల్సింది 152 పరుగులే. అతడికంటే ముందు గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.  

తొలి టెస్టు నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్ వద్ద విరాట్‌బాల్ ఉందని పేర్కొన్నారు. ఇంగ్లండ్‌పై కోహ్లీ 28 టెస్టుల్లో 1991 పరుగులు చేశాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను ఎదుర్కొనేందుకు విరాట్‌బాల్ సిద్ధంగా ఉందని అనుకోవచ్చని చెప్పారు. అర్ధ సెంచరీలను సెంచరీలుగా మార్చడంలో కోహ్లీ దిట్ట అని, అతడు మంచి కన్వెర్షన్ రేటును కలిగి ఉన్నాడని కితాబిచ్చాడు. 

గత ఒకటి రెండు సంవత్సరాలుగా ఇంగ్లండ్ క్రికెట్ టెస్టుల్లో దూకుడుగా ఆడుతోందని, పరిస్థితితో పనిలేకుండా అటాకింగ్ గేమ్ ఆడుతోందని గవాస్కర్ గుర్తు చేశారు. అయితే, ఇది భారత్‌ స్పిన్నర్లపై ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలని అభిప్రాయపడ్డారు. 
 
తొలి రెండుటెస్టులకు భారత జట్టు
రోహిత్‌శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్.

  • Loading...

More Telugu News