dharani: ధరణి పోర్టల్ లో ప్రారంభం నుంచే లోపాలు ఉన్నాయి.. రైతులు భూహక్కును కోల్పోయారు: కమిటీ
- ధరణి సమస్యలపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను ఇస్తామన్న కమిటీ
- ధరణి తప్పిదాలతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలను అన్నదాతలు పొందలేకపోయారని వెల్లడి
- యజమానికి తెలియకుండా భూలావాదేవీలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్న కమిటీ
ధరణి పోర్టల్‌లో ప్రారంభం నుంచే చాలా లోపాలు ఉన్నాయని... దీంతో చాలామంది రైతులు భూహక్కును కోల్పోయారని కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి కమిటీ వెల్లడించింది. ధరణి పోర్టల్‌పై కోదండరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సోమవారం ఈ కమిటీ మూడోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ... ధరణి సమస్యలపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను ఇస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ సమస్యలతో పాటు దానితో ముడిపడి ఉన్న అన్ని శాఖలతోనూ చర్చించి ఆ తర్వాత సమగ్రమైన నివేదిక రూపొందిస్తామన్నారు.
ధరణి పోర్టల్‌లో అనేక తప్పిదాలతో రైతుబంధు, ఇతర ప్రభుత్వ రాయితీలను అన్నదాతలు పొందలేకపోయారన్నారు. ధరణి బాధితులకు ఉపశమనం కోసమే మధ్యంతర నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పోర్టల్‌లో పారదర్శకత లేదని... యజమానికి తెలియకుండా భూలావాదేవీలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. త్వరలో జిల్లా కలెక్టర్లతో పాటు వ్యవసాయ, రిజిస్ట్రేషన్ శాఖలతో సమావేశమవుతామని వెల్లడించారు.