Rajasthan Minister: మథురలో కృష్ణుడి గుడి కోసం రాజస్థాన్ మంత్రి ప్రతిజ్ఞ
- ఒక్కపూటే భోజనం చేస్తానంటూ ప్రతిన బూనిన మదన్ దిలావర్
- రామమందిరం కోసం మెడలో దండ వేసుకోనంటూ గతంలో ప్రతిజ్ఞ
- బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం దీక్ష విరమించిన మంత్రి
శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురలో ఆలయం నిర్మించే వరకూ ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తానంటూ రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ తాజాగా ప్రతినబూనారు. మథురలో శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరెస్సెస్ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత మదన్ దిలావర్ గతంలో రామ మందిరం కోసం కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశారు. ఆయన కరసేవకుడిగా అయోధ్యలో రాముడి గుడి కోసం పోరాడారు. రామ జన్మభూమిలో మందిరం నిర్మించే వరకూ మెడలో దండ వేసుకోనని దీక్ష చేపట్టారు. ఏళ్ల తరబడి కొనసాగించిన ఈ దీక్షను అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సోమవారం విరమించారు.
ఈ సందర్భంగా రామ్ గంజ్ మండి సిటీలో జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. డమరుకం మోగిస్తూ, తాళాలు వాయిస్తూ మంత్రి తన ఆనందాన్ని చాటుకున్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయోధ్యలో తన కరసేవ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయోధ్య రామ మందిరంతో కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మందిర నిర్మాణం మిగిలి ఉందని అన్నారు. మథురలో శ్రీకృష్ణుడికి మందిరం నిర్మించే వరకు రోజుకు ఒక్క పూట భోజనం చేస్తానని మదన్ దిలావర్ తాజాగా ప్రతిజ్ఞ చేశారు.