Australia: గోల్డెన్ వీసాలు రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం... ఎందుకంటే!
- ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతో గోల్డెన్ వీసాల జారీ
- విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యం
- ఆశించిన ప్రయోజనం రాకపోవడంతో గోల్డెన్ వీసాల రద్దు
- ఇకపై వృత్తి నిపుణుల వీసాల జారీకి ఆస్ట్రేలియా యోచన
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి. దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. విదేశీ సంపన్న పెట్టుబడిదారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆస్ట్రేలియా వచ్చి పెట్టుబడులు పెట్టేలా చేయడమే ఈ గోల్డెన్ వీసాల ఉద్దేశం.
వీటిని ఆస్ట్రేలియా 2012లో ప్రవేశపెట్టింది. ఈ వీసాతో విదేశీ పెట్టుబడిదారులు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హక్కు పొందుతారు. కనీసం ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. ఈ వీసా పొందగోరే వాళ్లకు ఇంగ్లీషులో మాట్లాడాలన్న నిబంధన కానీ, వయో పరిమితి కానీ ఉండవు. ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టడమే ముఖ్యం.
ఈ గోల్డెన్ వీసా విధానాన్ని సద్వినియోగ పర్చుకుంది చైనా సంపన్నులేనని చెప్పాలి. ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన గోల్డెన్ వీసాలు పొందినవారిలో 85 శాతం చైనా వ్యాపారవేత్తలే ఉన్నారు. అయితే, ఈ వీసాలతో ఆస్ట్రేలియాకు లబ్ది చేకూరకపోగా, ఆస్ట్రేలియాలో ఉన్న సంపదను విదేశాలకు తరలిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో గోల్డెన్ వీసాల నుంచి ఆశించిన ప్రయోజనం రావడంలేదని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, వాటిని రద్దు చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చింది. గోల్డెన్ వీసాల బదులు దేశంలో ఉత్పాదకతను పెంచడం కోసం వృత్తి నిపుణులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వాలని సంకల్పించింది.
దీనిపై ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి క్లేర్ ఓనీల్ స్పందించారు. ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉన్నప్పటికీ గోల్డెన్ వీసాలతో ఎలాంటి ప్రయోజనం సమకూరడంలేదని, ఆస్ట్రేలియా ఏం ఆశించి ఈ వీసాలను తీసుకువచ్చిందో, ఆ ఉద్దేశం నెరవేరడంలేదని పేర్కొన్నారు.
ఇక, గోల్డెన్ వీసాల రద్దు ప్రభావం భారతీయులపై తక్కువే. అదే సమయంలో, వృత్తి నిపుణులకు ప్రత్యేక వీసాలు ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం మన టెక్ నిపుణులకు, ఇతర రంగాల నిపుణులకు ఎంతో లాభదాయకంగా మారనుంది.