Rahul Dravid: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చిన టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్
- టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
- జనవరి 25 నుంచి తొలి టెస్టు
- కేఎల్ రాహుల్ కేవలం బ్యాట్స్ మన్ గానే ఆడతాడన్న ద్రావిడ్
- కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ లో ఒకరు కీపింగ్ చేస్తారని వెల్లడి
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. కాగా, ఈ సిరీస్ కు సంబంధించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక అంశం వెల్లడించారు.
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడని స్పష్టం చేశారు. జట్టు ఎంపిక సమయంలోనే ఇద్దరు కీపర్లను సెలెక్ట్ చేయడం అందుకేనని తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినప్పటికీ, సొంతగడ్డపై సిరీస్ లో కేవలం బ్యాట్స్ మన్ గానే ఆడతాడని వివరించారు.
భారత్ లో స్పిన్ పిచ్ లు ఉంటాయని, ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి పిచ్ లపై స్పెషలిస్ట్ కీపర్ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించామని ద్రావిడ్ అసలు విషయం చెప్పారు. ఈ సిరీస్ లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరన్న దానికి కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు.