AP Congress: షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడు.. నేటి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ

AP Congress to take applications from MP and MLA tickets seeking candidates
  • రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఏపీ కాంగ్రెస్
  • ఈ ఉదయం 11 గంటల నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • మాజీలకే పెద్దపీట వేసే అవకాశం
ఏపీ కాంగ్రెస్ బాధ్యతను షర్మిల చేపట్టిన తర్వాత ఆ పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆమె అప్పుడే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రను చేపట్టారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజితం చేయడం, యాక్టివ్ గా లేని నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం లక్ష్యంగా ప్రస్తుతం ఆమె జిల్లాల యాత్ర కొనసాగుతోంది. వైఎస్సార్ ఆత్మబంధువు, రాజకీయ మేధావి కేవీపీ రామచంద్రరావు, సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఆమె పక్కనే ఉంటూ ఆమెకు అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహ రచన చేస్తున్నారు. 

మరోవైపు ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... అప్పుడే సరైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈరోజు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ దరఖాస్తులను స్వీకరిస్తారు.  

దరఖాస్తు చేసుకునే వారికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. పూర్తి అర్హతలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను నిర్ణయిస్తారు. అయితే, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు దూరంగా ఉన్న మాజీలంతా సొంతగూటికి రావాలని షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు మాజీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్టు పీసీసీ వర్గాలు చెపుతున్నాయి. జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిలను కలిసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నట్టు సమాచారం.
AP Congress
MLA
MP
YS Sharmila
KVP Ramachandra Rao
Raghuveera Reddy
Lok Sabha Polls
Assembly Elections
AP Politics

More Telugu News