Ganta Srinivasa Rao: తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన.. జగన్, స్పీకర్ తమ్మినేనిపై ఫైర్!

Ganta Srinivas Rao fires on Jagan and Tammineni Sitaram after accepting his resignation

  • మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా అంటూ గంటా ఆగ్రహం
  • ఆమోదించే ముందు తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని మండిపాటు
  • రాజ్యసభ ఎన్నికల భయం జగన్ లో కనిపిస్తోందని ఎద్దేవా
  • వైసీపీకి వ్యతిరేకంగా 50 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని భయపడుతున్నారని వ్యాఖ్య
  • రాజకీయ లబ్ధి కోసం రాజీనామాను ఆమోదించారని విమర్శ

టీడీపీ ఎమ్మెల్యే (మాజీ) గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాసరావు ఆమోదించడం రాజకీయంగా చర్చనీయాంశమయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో ఆయన రాజీనామా చేశారు. అయితే, ఇంతకాలం ఆయన రాజీనామాను పెండింగ్ లో ఉంచిన స్పీకర్... దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించారు. 

ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ... మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా? అని స్పీకర్ పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో తాను స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరినప్పటికీ పెండింగ్ లో పెట్టారని... ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల సమయం ఉన్న తరుణంలో రాజీనామాను ఆమోదించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రాజీనామాను ఆమోదించడం సరికాదని అన్నారు. రాజీనామాను ఆమోదించే ముందు కనీసం తన అభిప్రాయాన్ని తీసుకోవాలనే నియమాన్ని కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నికల గురించి జగన్ ఎంత భయపడుతున్నారో తన రాజీనామా ఆమోదంతో అర్థమవుతోందని గంటా ఎద్దేవా చేశారు. రాజ్యసభ సీట్ల భయం జగన్ లో కనిపిస్తోందని... వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా 50 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనే భయంలో జగన్ ఉన్నారని చెప్పారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు తాను కట్టుబడి ఉన్నానని గంటా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తన రాజీనామాను జగన్ ఆమోదింపజేశారని... ఈ చర్యతో స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా అనే దమ్ముందా? అంటూ జగన్ కు సవాల్ విసిరారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తనకున్న అవకాశాలపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటానని చెప్పారు.

  • Loading...

More Telugu News